1908 టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చిన సమాచారంతో తీగలాగిన ఈగల్ అధికారులు
డెడ్‌డ్రాప్ గంజాయికి అలవాటుపడిన వినియోగదారుల ట్రాప్
డమ్మీ ఆర్డర్లతో బొల్లా కిరణ్ బ్రదర్స్ గుట్టురట్టు
హైదరాబాద్, వెలుగు: బాలానగర్ కేంద్రంగా సాగిన బొల్లా కిరణ్ బ్రదర్స్ గంజాయి దందా వ్యవహారంలో ఈగల్ ఫోర్స్ కీలక వివరాలు వెల్లడించింది. బొల్లా డెడ్ డ్రాప్ గంజాయి దందాపై జరిపిన ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ భోలా’ అనే పేరు పెట్టింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈగల్ ఫోర్స్ టోల్‌ఫ్రీ నంబర్ 1908కు వచ్చిన ఒక మెసేజ్ ద్వారా ఈగల్ అధికారులు నెల రోజులపాటు నిఘా పెట్టి కూపీ లాగారు. ఒడిశా అటవీ ప్రాంతం నుంచి బాలానగర్‌లో కస్టమర్లకు డెడ్‌డ్రాప్ విధానంలో సాగుతున్న గంజాయి దందాను ఎలా చేధించారనే వివరాలను వెల్లడించింది.
మే నుంచే ఆపరేషన్ భోలా..
ఈ ఏడాది మే 28న ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1908కు కూకట్‌పల్లి ప్రాంతంలోని ఒక హాస్టల్‌లో ఉంటున్న సత్య అవినాశ్ అనే వ్యక్తి ఎండీఎంఏ, ఎల్‌ఎస్డీ వంటి డ్రగ్స్ విక్రయిస్తున్నాడని సమాచారం అందింది. దీని ఆధారంగా సత్య అవినాశ్‌ను అధికారులు అదుపులోకి తీసుకుని డ్రగ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. వాట్సాప్‌లో ఆర్డర్ చేసి, ఆన్‌లైన్‌లో డబ్బులు పంపితే డెడ్‌డ్రాప్ విధానంలో తనకు ఒకరు గంజాయి సరఫరా చేసినట్లు నిందితుడు తెలిపారు. ఇలా జులై 7న ఈ మొత్తం డెడ్‌డ్రాప్ గంజాయి దందా కీలక విషయాలను ఈగల్ అధికారులు గుర్తించారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా ప్రాంతం నుంచి 31 మంది గంజాయి డీలర్లు బాలానగర్ ప్రాంతంలోని బొల్లా బ్రదర్స్‌కు గంజాయి సరఫరా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.
230 మంది కస్టమర్లు, 100 మందికి డ్రగ్స్ టెస్ట్‌లు..
బొల్లా గంజాయి కస్టమర్లుగా ఉన్న వారిలో మొత్తం 230 మందికి సంబంధించిన ఫోన్ నంబర్లను ఈగల్అధికారులు గుర్తించారు. ఇందులో కోరుట్లకు చెందిన ఒక కన్స్యూమర్‌ను అదుపులోకి తీసుకున్న ఈగల్ అధికారులు.. అతడి ద్వారా ఆన్‌లైన్‌లో డమ్మీ ఆర్డర్లు ఇప్పిస్తూ బొల్లా బ్రదర్స్ డెడ్‌డ్రాప్ లొకేషన్లను పూర్తిగా తెలుసుకున్నారు. అనంతరం ఆగస్టు 12న రాత్రి ‘ఆపరేషన్ భోలా’ను అధికారులు అమలు చేశారు.
ఈ కేసులో కీలక నిందితులైన బొల్లా బ్రదర్స్‌తోపాటు ఒడిశా గంజాయి సరఫరా ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠా వద్ద గంజాయి కొనుగోలు చేసిన కన్స్యూమర్లలో 100 మందికి డ్రగ్ టెస్ట్ చేయగా, 80 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 38 మందిని డీ-–అడిక్షన్ సెంటర్లకు పంపించామని, మిగతా వారిని కూడా త్వరలో పంపుతామని ఈగల్ అధికారులు తెలిపారు. కన్స్యూమర్ల జాబితాలో ఉన్న మరో 125 మందికి గంజాయి టెస్ట్‌లు చేస్తామని పేర్కొన్నారు.
